
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిఎం కేసీఆర్ మానవతా దృక్పదంతో నిర్ణయించారు. దీని కోసం ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము. అయితే కేవలం తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తాము. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని కొనబోము. కనుక ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ధాన్యం ప్రవేశించకుండా అడ్డుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకొంటున్నాము.
తెలంగాణలో సేకరించిన ముడి బియ్యం ఎంత ఇస్తే అంతా తీసుకొంటామని కేంద్రమంత్రులు పదేపదే చెప్పారు కనుక ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నాము. ధాన్యం మిల్లింగులో నూకల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి ముడి బియ్యం సేకరించి కేంద్రానికి సరఫరా చేస్తుంది. కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ముడి బియ్యం అంతా కొనుగోలు చేయాలని త్వరలో కేంద్రప్రభుత్వానికి లేఖ వ్రాయబోతున్నాము. ఒకవేళ దీనిపై కూడా కేంద్రం మళ్ళీ మాట మార్చితే ఉద్యమించవలసి వస్తుంది,” అని అన్నారు.