ఇప్పుడు ప్రతీ 3 నిమిషాలకు ఓ మెట్రో రైల్

హైదరాబాద్‌లో ఎండలు పెరిగి, ఐ‌టి కంపెనీలన్నీ మళ్ళీ తెరుచుకోవడంతో మెట్రో రైళ్ళలో ప్రయాణించేవారి సంఖ్య బాగా పెరిగింది. గత పది రోజులలోనే రోజుకి 50 వేల మంది అదనంగా ప్రయాణిస్తున్నారని మెట్రో అధికారులు తెలిపారు. పది రోజుల క్రితం వరకు మూడు కారిడర్లలో కలిపి రోజుకి సుమారు 2 లక్షల నుంచి 2.25 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు వారి సంఖ్య రోజుకి 2.75 లక్షలకు పెరిగిందని తెలిపారు. కనుక ఇక నుంచి రద్దీ సమయాలలో ప్రతీ ఐదు నిమిషాలకు బదులు ప్రతీ మూడు నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో రైళ్ళను నడిపిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఎల్బీ నగర్‌, నాగోల్, మియాపూర్, సికింద్రాబాద్‌, అమీర్‌పేట్ నుంచి ఐ‌టి కంపెనీలు ఎక్కువగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీలకు ఎక్కువమంది ఐ‌టి ఉద్యోగులు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. కనుక వారికి అనువుగా ఉండేవిదంగా మెట్రో రైళ్ళు నడిపిస్తున్నామని మెట్రో అధికారులు తెలిపారు. 

హైదరాబాద్‌లో 2017, నవంబర్‌ 29 నుంచి మెట్రో రైల్ సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి 2020 మార్చిలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రవేశించే సమయానికి మెట్రో రైళ్ళలో రోజుకి సుమారు 3.50 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రయాణించేవారు. ఆ తరువాత వరుసగా రెండుసార్లు వచ్చిన కరోనా దెబ్బకి మెట్రో చాలాకాలం కోలుకోలేకపోయింది. సెకండ్ వేవ్ ముగిసిన తరువాత కూడా రోజుకి 60-70 వేలమంది మాత్రమే ప్రయాణించేవారు. ఆ తరువాత క్రమంగా ఆ సంఖ్య లక్ష నుంచి లక్షన్నరకు చేరింది. 

కరోనా బెడద పూర్తిగా తగ్గిపోవడంతో ఇప్పుడు మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజుకి 2.75 లక్షలకి చేరుకొంది. మళ్ళీ కరోనా విరుచుకుపడకపోతే త్వరలోనే మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజుకి 4 లక్షలకు చేరుకొనే అవకాశం ఉంది. అప్పుడే హైదరాబాద్‌ మెట్రో నష్టాల ఊబిలో నుంచి బయటపడగలదు.