నేటి నుంచి బండి సంజయ్‌ మహా సంగ్రామయాత్ర

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నేటి నుంచి రెండో విడత మహా సంగ్రామయాత్రను ప్రారంభించబోతున్నారు. ఈరోజు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ముందుగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు ఆర్పిస్తారు. తరువాత అక్కడి నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లా చేరుకొని అక్కడ జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత రాష్ట్ర బిజెపి వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో  ఆలంపూర్ నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభిస్తారు. 

రెండో విడత మహా సంగ్రామయాత్రలో గద్వాల్, మక్తల్, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, నారాయణపేట, కల్వకుర్తి మీదుగా 31 రోజులలో రోజుకి 13 కిమీ చొప్పున మొత్తం 381 కిమీ పాదయాత్ర చేస్తారు. వేసవి ఎండలు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున ప్రతీరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. మే 14వ తేదీన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో దీనీ ముగిస్తారు. ఆదేరోజు సాయంత్రం ఆలంపూర్‌లో బిజెపి అధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో బండి సంజయ్‌ పాల్గొంటారు. 

ఈ పాదయాత్రలో భాగంగా గ్రామాలలో రచ్చబండ పేరిట సమావేశాలు, పట్టణాలలో సభలు నిర్వహిస్తూ  ముందుకు సాగుతారు. తెలంగాణలో టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు బండి సంజయ్‌ చెప్పారు.