మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కేసుపై నేడు తీర్పు

మజ్లీస్‌ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై నమోదైన కేసుపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నేడు తుది తీర్పు ప్రకటించనుంది. తొమ్మిదేళ్ళ క్రితం ఆయన నిజామాబాద్‌, నిర్మల్ పట్టణాలలో నిర్వహించిన బహిరంగ సభలలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేవిదంగా మాట్లాడినందుకు పోలీసులు ఆయనపై సెక్షన్స్ 153ఏ, 295ఏ కింద కేసులు నమోదు చేశారు. అప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ రిమాండ్ మీద 40 రోజులు జైలులో గడిపారు కూడా. అప్పటి నుంచి ఆ కేసు సుదీర్గంగా విచారణ జరుగుతూనే ఉంది. 

ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు ముగియడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. కోర్టు ఆయనను దోషిగా నిర్దారించి శిక్ష విధిస్తుందా లేక మళ్ళీ ఇటువంటి పొరపాట్లు చేయవద్దని మందలించి జరిమానాతో సరిపడుతుందా? అనేది మరికొద్ది సేపటిలో తెలుస్తుంది. ఒకవేళ కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించినట్లయితే, అప్పుడు ఆయన హైకోర్టును ఆశ్రయించడం ఖాయం. ఒకవేళ హైకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలితే సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఖాయం. కనుక ఈ కేసు విచారణ ఇప్పటిలో పూర్తయ్యేది కాదనే భావించవచ్చు.