ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా...కేంద్రానికి సిగ్గుచేటు

సిఎం కేసీఆర్‌ అధ్వర్యంలో నేడు ఢిల్లీ టిఆర్ఎస్‌ నిరసన దీక్ష చేపట్టడంపై  జాతీయ రైతు ఉద్య‌మ నాయ‌కుడు రాకేశ్ తికాయ‌త్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, “ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టడం కేంద్రప్రభుత్వానికి సిగ్గుచేటు. ధాన్యం కొనుగోలులో దేశమంతా ఒకే విధానం అమలుచేయాలి లేకుంటే రైతులు మళ్ళీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సి వస్తుంది,” అని హెచ్చరించారు. 



 రాకేశ్ తికాయ‌త్ టిఆర్ఎస్‌ దీక్షలో కూడా పాల్గొని సంఘీభావం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. రైతులకు నష్టం కలిగించే సాగుచట్టాలను రద్దు చేయాలని కోరుతూ 13 నెలలపాటు ఢిల్లీలో ఆందోళనలు చేశాము. తెలంగాణ సిఎం కేసీఆర్‌ రైతుల కోసమే ఇక్కడ దీక్ష చేస్తున్నారు తప్ప ఓట్ల రాజకీయాల కోసం కాదు. రైతుల పక్షాన్న కేంద్రంతో పోరాడేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తాము. అందుకే సిఎం కేసీఆర్‌ దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నాను,” అని అన్నారు.