సిఎం కేసీఆర్‌ అధ్యర్యంలో నేడు ఢిల్లీలో ధర్నా

తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారిగా నేడు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ఆవరణలో సిఎం కేసీఆర్‌ అధ్వర్యంలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ ‘రైతుల పక్షాన్న ప్రజా ప్రతినిధుల దీక్ష’ పేరిట ధర్నా జరుగబోతోంది. ధర్నాలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిద కార్పొరేషన్ల ఛైర్మన్‌లు, పురపాలక సంఘాల అధ్యక్షులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, టిఆర్ఎస్‌ కార్యవర్గ సభ్యులు తదితరులు సుమారు 1,500 మందికి పైగా తరలివచ్చారు. 

టిఆర్ఎస్‌ దీక్ష సందర్భంగా ఢిల్లీలో సిఎం కేసీఆర్‌, మంత్రుల ఫోటోలతో గులాబీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. గులాబీ రంగులో కొట్టవచ్చినట్లు కనబడుతున్న బ్యానర్లలో ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హిందీ, ఇంగ్లీషు భాషల్లో అచ్చు వేయించిన నినాదాలను ఢిల్లీ ప్రజలు వాటిని ఆసక్తిగా గమనిస్తున్నారు. తెలంగాణ భవన్‌ పరిసర ప్రాంతాలన్నీ బ్యానర్లతో గులాబీ మయం అయ్యాయి. 


ఈరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ధర్నా జరుగుతుంది. ముందుగా సిఎం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన తరువాత, ఆవరణలోని డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి, వేదిక వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి, మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు ఆర్పిస్తారు. తరువాత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వేదికపైకి వచ్చి దీక్షలో కూర్చోంటారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ సిఎం కేసీఆర్‌తో సహా ప్రజాప్రతినిధులు ప్రసంగిస్తారు. 

సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో జరుగబోతున్న ఈ దీక్షకు భారత్‌ కిసాన్ నేత రాకేశ్ తికాయత్ సంఘీభావం ప్రకటిస్తూ దీక్షలో పాల్గొనబోతున్నారు. 

ఢిల్లీలో చాలా ఎండలు, వడగాడ్పులు చాలా తీవ్రంగా ఉండటంతో దీక్షలో పాల్గొనేవారి కోసం షామియానాలు వేయించి, చుట్టూ ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. అందరికీ చల్లటి మంచి నీళ్ళు, మజ్జిగ అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నుంచి ఈ దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన వారందరికీ జిల్లాల వారీగా వసతి, భోజనాలు ఏర్పాటు చేశారు.  మధ్యాహ్నం ఒంటి గంటకు దీక్ష ముగిసిన తరువాత అందరూ భోజనాలు చేసి సాయంత్రం విమానాలలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.