
తెలంగాణలో పండిన ధాన్యం మొత్తం కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్రంలో టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం ఢిల్లీలో తెలంగాణ భవన్ వద్ద ధర్నా చేసేందుకు టిఆర్ఎస్ నేతలు సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ ధర్నాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు 1,500 మంది పాల్గొనబోతున్నారు. ఈ ధర్నాలో సిఎం కేసీఆర్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఒకవేళ కొనుగోలు చేసినా అంత ధాన్యాన్ని నిలువ చేసేందుకు సరిపడా గోదాములు లేనందునే కేంద్రప్రభుత్వాన్ని ధాన్యం కొనుగోలు చేయమని కోరుతున్నామని అన్నారు. తెలంగాణలో పండిన ధాన్యం మొత్తం కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.