శోభాయాత్రకు షరతులతో హైకోర్టు అనుమతి

రేపు ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌, నిర్మల్ జిల్లా భైంసాలో శోభాయత్రలు నిర్వహించడానికి హైకోర్టు షరతులతో అనుమతించింది. పోలీసులు శాంతి భద్రతల సాకు చూపుతూ శోభాయత్రకు అనుమతించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలితకుమార్ శుక్రవారం విచారణ చేపట్టి, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతించిన మార్గాలలో శోభాయత్ర నిర్వహించుకోవచ్చునని తీర్పు చెప్పారు. 

హైదరాబాద్‌ నగరంలో సీతారాంబాగ్‌లోని ఆలయం వద్ద నుంచి బోయిగూడ కమాన్, మంగళ్ హాట్ పోలీస్‌స్టేషన్‌ రోడ్, ధూల్‌పేట, పురానాపూల్, జుమెరాత్ బజార్, సిద్ది అంబర్ బజార్, చూడీబజార్, బేగంబజార్ ఛత్రి, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమన్, గురుద్వార, పుత్లీబౌలీ చౌరస్తా మీదుగా సుల్తాన్ బజార్‌ వద్ద గల హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుపుకొనేందుకు హైకోర్టు అనుమతించింది. 

ఇక భైంసాలో గోపాల్‌దాస్ హనుమాన్ ఆలయం నుంచి పాత సోనా చాందినీ, కుబేర్ అడ్డా, బస్టాండ్, నిర్మల్ చౌరస్తా, రాంలీలమైదాన్ వరకు శోభాయత్ర నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించింది.