తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ల మద్య మొదలైన వివాదం ఢిల్లీ వరకు చేరడంతో టిఆర్ఎస్ తగ్గేదేలే... అంటూ ధీటుగా స్పందిస్తోంది.
మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “గవర్నర్ గౌరవానికి భంగం కలిగించేవిదంగా మేము ఎన్నడూ వ్యవహరించలేదు. తమిళనాడు బిజెపి అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె గవర్నర్ పదవికి అర్హురాలైనప్పుడు, రాజకీయాలలో ఉన్న కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి ఎందుకు అర్హుడు కారు?ఈ కారణంగానే మాతో దూరం పెరిగిందని ఆమె ఏదేదో ఊహించుకొంటూ మాట్లాడితే మేమేమీ చేయలేము. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలచుకొన్నాను. మాకు గవర్నర్‌తో ఎలాంటి పంచాయితీ లేదు. గతంలో గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌తో మాకు ఎటువంటి పంచాయతీ లేనప్పుడు ఇప్పుడు ఈమెతో ఎందుకుటుంది? శాసనసభ ప్రోరోగ్ కానందునే బడ్జెట్ సమావేశాలకు ఆమెను ఆహ్వానించలేదు. కానీ ఇది కూడా తనని అవమానించడమే అని ఆమె భావిస్తే మేమేమి చేయలేము. అయినా గవర్నర్ గవర్నర్ లెక్కన వ్యవహరిస్తే తప్పకుండా గౌరవం లభిస్తుంది,” అని అన్నారు.