హైదరాబాద్‌ పోలీసులకు ఘోర అవమానం

హైదరాబాద్‌ పోలీసులకు ఘోర అవమానం జరిగింది. ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ అనిల్ కుమార్, హోంగార్డ్ కారయ్యతో కలిసి మంగళవారం తెల్లవారుజామున ముషీరాబాద్‌లో విధులు నిర్వహిస్తుండగా నిబందనలకు విరుద్దంగా తెల్లవారుజామున 2.10 గంటలకు కొన్ని దుకాణాలు తెరిచి వ్యాపారాలు కొనసాగిస్తుండటం చూసి వాటిని మూసేయాలని వారు కోరారు. 

ఆ సమయంలో అక్కడే ఉన్న మజ్లీస్‌ పార్టీకి చెందిన భోలక్‌పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్ మహమ్మద్ వారిని అడ్డుకొని, “మిమ్మల్ని నెలరోజుల వరకు ఇటువైపు రావద్దని చెప్పానా?ఎందుకు వచ్చారు?వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి...మీ వేషాలు ఇక్కడ పనికిరావు...” అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో వారు ఈ విషయం తమ ఎస్సైకి తెలియజేస్తామని చెప్పగా, “అలాగే మీ ఎస్సైకి కాల్ చేయండి అతనితో నేను మాట్లాడుతాను. సౌ రూప్యా కా ఆద్మీ హై తుమ్ లోగ్ (వంద రూపాయలు విసిరేస్తే ఏరుకొనే వాళ్ళు మీరు) అంటూ పదేపదే అవమానించారు. 


ఈ ఘటన పురపాలక మంత్రి కేటీఆర్‌ దృష్టికి రావడంతో వెంటనే డిజిపి మహేందర్ రెడ్డిని ట్వీట్ ద్వారా సదరు కార్పొరేటరుపై చర్యలు తీసుకోవాలని కోరారు. దానికి వెంటనే స్పందించిన డిజిపి మహేందర్ రెడ్డి మజ్లీస్ కార్పొరేటర్ గౌసుద్దీన్ మహమ్మద్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించడంతో, ముషీరాబాద్ పోలీసులు అతనిపై సెక్షన్స్ 353, 506 కింద కేసులు నమోదు చేసి బుదవారం అరెస్ట్ చేశారు.