తెలంగాణ ప్రభుత్వంపై మళ్ళీ విరుచుకుపడిన గవర్నర్‌

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈరోజు ఉదయం కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసిన తరువాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నేను ప్రభుత్వంతో స్నేహపూర్వకంగానే ఉంటున్నాను. నేను సంస్యల పరిష్కరించడానికి కృషి చేస్తాను తప్ప సృష్టించను. అమిత్ షాతో నేను ఏమి మాట్లాడానో అన్నీ మీడియాకు వివరించలేను కానీ నేను ఏమి మాట్లాడినా అది తెలంగాణ పుదుచ్చేరి ప్రజల మేలు కోసమే అని ఖచ్చితంగా చెప్పగలను. నాతో సిఎం కేసీఆర్‌కి, మంత్రులు, ఎమ్మెల్యేలకి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వారు నేరుగా నవద్దకు వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ నేను ఉగాది వేడుకలకి పిలిచినా ఎవరూ రాలేదు. ఒక మహిళా గవర్నర్‌ను గౌరవించే తీరు ఇదేనా? ప్రభుత్వం (సిఎం కేసీఆర్‌) నన్ను ఒక గవర్నర్‌గా చూడకపోయినా కనీసం ఓ మహిళగా, ఓ సోదరిగానైనా చూడలేరా?

నాకు యాదాద్రిలో అవమానాలు ఎదురయ్యాయని నేను ఎవరితో చెప్పలేదు. యాదాద్రిలో నాకు స్వాగతం చెప్పడానికి అధికారులు ఎవరూ రాలేదని మీడియాయే వ్రాసింది. హైదరాబాద్‌ నుంచి మేడారంకు వెళ్లినప్పుడు అక్కడా ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని నేను ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఆ సమయంలో అక్కడే ఉన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. మొన్న నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటనకు కారులోనే వెళ్ళాను. అక్కడ అధికారులు ఎవరూ రాలేదు. అయినా రాష్ట్రంలో ఏమి జరుగుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు కనుక ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.

ఈ నెల 11న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీరామపట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొనడానికి కారు లేదా రైలులో వెళ్ళబోతున్నాను. రాష్ట్రంలో గవర్నర్‌ ప్రయాణించడానికి ఇంతకుమించి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇక ముందు కూడా అవసరమైతే రాష్ట్రమంతటా రోడ్డు మార్గంలోనే పర్యటిస్తాను. ఇదీ...రాష్ట్ర గవర్నర్‌ పరిస్థితి. నా పరిస్థితిని నేను ప్రజల ముందు పెడుతున్నాను. దీనిలో మంచిచెడులను వారే నిర్ణయించుకొంటారు. 

రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా నా దారిలో నేను నడుస్తుంటాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 రోజులపాటు రాజ్‌భవన్‌లో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తాను,” అని అన్నారు.