7.jpg)
రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందిస్తూ ప్రధాని నరేంద్రమోడీపై ట్విట్టర్‌లో వ్యంగ్యస్త్రాలు సందించారు.
“దేశ జీడీపీ పెరగడం లేదని ఎవరన్నారు?ప్రతీరోజూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ ఆ పెంపును ప్రజలకు అలవాటుపడేలా చేసిన మోడీజీ మీకు చాలా థాంక్స్. అయితే బిజెపిలో కొందరు మేధావులు ఇదంతా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకే అని దీనిని కూడా చక్కగా సమర్ధించుకోగలరు,” అని ట్వీట్ చేస్తూ “దేశంలో రెండు వారాలలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 పెంపు,” అంటూ ఎన్‌టీవీ న్యూస్ ఛానల్‌లో వచ్చిన ఓ వార్తను జోడించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెరగడాన్ని ప్రజలు అలవాటుపడేలా చేశారనే మంత్రి కేటీఆర్ మాట నూటికి నూరుపాళ్లు నిజమని అందరికీ తెలుసు. ప్రతీరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా ఏమి చేయాలో ఎవరికి మొరపెట్టుకోవాలో పాలుపోక దేశ ప్రజలు వాటికి క్రమంగా అలవాటుపడుతున్నట్లుగానే ఉంది. ఇప్పుడు ఏ రోజైన పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోతేనే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అలాగే మీడియాకు కూడా ఇది హత్యలు, రోడ్డు ప్రమాదాలు, వేసవి ఉష్ణోగ్రతల మాదిరిగానే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కూడా ఓ రొటీన్ వార్తగా మారిపోయింది. నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో దేశ ప్రజలు అల్లాడిపోతున్నప్పటికీ కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విస్మయం కలిగిస్తుంది.