
వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇద్దరు వైద్యులపై ప్రభుత్వం బదిలీ, సస్పెన్షన్ వేటు వేసింది. హాస్పిటల్ ఆర్‌ఐసీయు వార్డులో అపస్మారకస్థితిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే ఓ రోగిని ఎలుకలు కొరికి తీవ్రంగా గాయపరిచిన ఘటన ప్రసార మాద్యమాల ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించి శాఖపరమైన విచారణకు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖలోని ఉన్నతాధికారులు, ఎంజిఎం హాస్పిటల్‌లోని వివిద విభాగాలకు చెందిన వైద్యులు గురువారం ఆర్‌ఐసీయుతో సహా హాస్పిటల్ అంతా పరిశీలించి మంత్రి హరీష్‌రావుకు నివేదిక సమర్పించారు. దాని ఆధారంగా ఆయన హాస్పిటల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను బదిలీ చేసి ఆర్‌ఐసీయులో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులను విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేశారు. హాస్పిటల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్థానంలో డాక్టర్ చంద్రశేఖర్‌ను నియమిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. ఎలుకలు కొరకడంతో తీవ్రంగా గాయపడిన రోగికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. హాస్పిటల్‌లో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డాక్టర్ చంద్రశేఖర్ గతంలో ఎంజిఎం హాస్పిటల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే హాస్పిటల్‌లో ఎలుకల సమస్యకు బదిలీలు, సస్పెన్షన్ పరిష్కారం కాదని చెప్పవచ్చు. సాధారణంగా ఏ హాస్పిటల్స్ వద్దనైనా ఎలుకల బెడద ఎక్కువగానే ఉంటుంది. కనుక వాటిని ఎప్పటికప్పుడు నిర్మూలిస్తుండవలసి ఉంటుంది. కానీ హాస్పిటల్ యాజమాన్యాలు, సిబ్బంది ఎలుకలను అసలు ఓ సమస్యగానే భావించకపోవడం, ఒకవేళ భావించినా వాటి నివారణకు డబ్బు ఖర్చు చేయకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం వలన ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. అదే..ఇలా సంచలనమైనప్పుడు మాత్రమే ప్రభుత్వం, హాస్పిటల్ యాజమాన్యాలు హడావుడి చేసి తరువాత మళ్ళీ చల్లబడిపోతుంటాయి. కనుక శాస్విత చర్యలు తీసుకోనంతవరకు ఇటువంటి విషాదఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయని చెప్పక తప్పదు.