
నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ప్రధాని నరేంద్రమోడీకి ట్విట్టర్‌లో చురకలు అంటించారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం అన్నివిదాల విఫలమైందని, రాష్ట్రాలపై పెనుభారం మోపుతోందని, నిరుపేద ప్రజల పట్ల సానుభూతి లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించిన నరేంద్రమోడీ తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, అధికార దుర్వినియోగం కాకుండా నివారిస్తామని హామీ ఇచ్చారు. అయితే మోడీ ప్రభుత్వం కూడా అదేవిదంగా వ్యవహరిస్తూ అన్నివిదాల విఫలమైందని మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. ఈ సందర్భంగా రోజుకి రూపాయి చొప్పున గత తొమ్మిది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయంటూ ఎన్‌డీటీవి న్యూస్ ఛానల్‌లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ క్లిప్పింగ్‌ను, 2012లో నరేంద్రమోడీ చేసిన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ జత చేసి దేశప్రజలకు ఇటువంటి ‘అచ్చే దిన్’ (మంచిరోజులు) కల్పించినందుకు థాంక్స్ మోడీజీ అంటూ చురకలు వేశారు.