కల్వకుంట్ల కవితకు రేవంత్‌ రెడ్డి చురకలు

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఓ తాజా ట్వీట్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ల మద్య కొత్త యుద్ధానికి బీజం వేసింది.       ‘‘ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయి. రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు.. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతన్నను క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజ కొనాలి.. తెలంగాణలో పండించిన చివరి గింజ కొనే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడి తీరుతుంది’’ అంటూ రాహుల్ ట్వీట్‌ చేయగా దానికి మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెంటనే ఘాటుగా ట్విట్టర్‌లోనే జవాబిచ్చారు. మళ్ళీ కవితకు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా వెంటనే ఘాటుగా బదులిచ్చారు.  

“మీ ఎంపీలు పార్లమెంటులో పోరాడటం లేదు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. అయినా ఇకపై కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ తండ్రిగారు గత ఏడాది ఆగస్టులో కేంద్రానికి లేఖ వ్రాసి సంతకం చేసి ఇచ్చారు. అదే ఇప్పుడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారు,” అని ట్వీట్ చేశారు.