
సోమ, మంగళవారం రెండు రోజులు భారత్ బంద్‌కు కార్మిక సంఘాలు పిలిపునిచ్చాయి. ఈ బంద్‌లో ఉక్కు, చమురు, బొగ్గు, టెలికాం, ఇన్స్యూరెన్స్ రంగాలకు చెందిన సుమారు 20 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గొంటున్నారు. కేంద్రప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరించడాన్ని నిరసిస్తూ బంద్ నిర్వహిస్తున్నారు. కార్మిక సంఘాల బంద్‌కు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. కనుక నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులు కూడా బంద్ కావచ్చు లేదా బ్యాంక్ అధికారులు నామమాత్రపు సేవలు అందించే అవకాశం ఉంది. ఈ బంద్‌లో అసంఘటిత రంగ కార్మికులు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నారు. పలు రాష్ట్రాలలో ఆటో కార్మిక సంఘాలు కూడా బంద్‌లో పాలుపంచుకొంటున్నాయి.
టిఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం రెండూ కూడా కేంద్రప్రభుత్వంపై ఇదివరకే యుద్ధం ప్రకటించాయి కనుక రాష్ట్రంలోని టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘాలు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. సింగరేణిలో బీఎంఎస్ మినహా టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టిబికెఎస్తో సహా అన్ని సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటుండటంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు రోజులు బంద్ వలన దేశానికి వేలకోట్లు నష్టం కలుగుతుంది. కనుక బంద్ గురించి కార్మిక సంఘాలు కేంద్రప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినా స్పందించకపోవడం విస్మయం కలిగిస్తుంది.