
ధాన్యం కొనుగోలు అంశంపై టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై యుద్ధం ప్రకటించడంతో బిజెపి మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఎదురుదాడి మొదలుపెట్టారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “అసలు హుజూరాబాద్ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచే సిఎం కేసీఆర్ ప్రవర్తనలో, రాష్ట్ర ప్రభుత్వ విధానంలో చాలా మార్పు వచ్చింది. అప్పటి నుంచే కేసీఆర్‌లో ‘అపరిచితుడు’ బయటకి వచ్చేడు. అప్పటి నుంచే ఏదో వంకతో కేంద్రంపై నిందలు వేస్తూ గొడవ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలని, రైతాంగాన్ని గందరగోళ పరిస్థితులలోకి నెడుతున్నారు.
ధాన్యం, గోధుమల సేకరణ ఇవాళ్ళ కొత్తగా మొదలుపెట్టలేదు. దశాబ్ధాలుగా జరుగుతోంది. ఇన్నేళ్ళుగా లేని సమస్య ఇప్పుడే వచ్చినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాలలో లేని సమస్య ఒక్క తెలంగాణ రాష్ట్రానికే వచ్చిందన్నట్లు మాట్లాడుతూ ప్రజలను, రైతులను రెచ్చగొడుతున్నారు. టిఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం ఈవిదంగా చేయడం రాష్ట్రానికి ఎంత మాత్రం మంచిది కాదు.
గతంలో యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు (2014లో) కేంద్రం తెలంగాణ నుంచి ధాన్యం సేకరణకు రూ.3,404 కోట్లు ఖర్చు చేస్తే, గత ఏడాది మా ప్రభుత్వం రూ.26,641 కోట్లు ఖర్చు చేసింది. మరి మా ప్రభుత్వం రైతువ్యతిరేక ప్రభుత్వమని టిఆర్ఎస్ మంత్రులు ఏవిదంగా నిందించగలరు? తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా సేకరిస్తున్న ధాన్యం మొత్తానికి కేంద్రప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు కావనే సంగతి కేసీఆర్‌కి కూడా తెలుసు. అయినా రైతులను తానే ఆదుకొంటున్నామని కేంద్రం మోసం చేస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారు.
గత ఏడాది కూడా ధాన్యం సేకరణ సజావుగా సాగిపోయింది. ఈ ఏడాది కూడా అదేవిదంగా సాగుతుంది. కానీ రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం సరఫరా చేయగలరో చెప్పమని అడుగుతుంటే చెప్పకుండా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణలో గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటలకు వేరే చట్టాలు ఉంటేయేమో కానీ దేశంలో తెలంగాణకు ఒక చట్టం మిగిలిన రాష్ట్రాలకు మరొకలా ఉండదు. అన్ని రాష్ట్రాల నుంచి ఒకే విదంగా ధాన్యం, గోధుమలు కొనుగోలు చేసి మళ్ళీ వాటిని రాష్ట్రాలకే ఇస్తుంటాము.
ప్రగతి భవన్ నుంచి గ్రామ పంచాయతీలకు తీర్మానాలు చేయాలంటూ ఆదేశాలు పంపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రంలో ఆందోళనలు చేయించాలనుకోవడం చాలా దారుణం. ధాన్యం పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకొనే హక్కు కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారు?
ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ప్రకారమే సిఎం కేసీఆర్ నడుచుకొంటున్నారు...మాట్లాడుతున్నారు. ఆయన సూచన మేరకే సిఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై రగడ చేస్తున్నారని మాకు తెలుసు. సిఎం కేసీఆర్ హెలికాప్టర్ వేసుకొని రాష్ట్రాలలో తిరుగుతూ బిజెపి ఓడిపోతుందని ప్రచారం చేసి వచ్చారు. కానీ నాలుగు రాష్ట్రాలలో బిజెపి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అలాగే తెలంగాణలో కూడా బిజెపి అధికారంలోకి వస్తుంది,” అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.