4.jpg)
ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రం తీరును తప్పు పడుతూ సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీ బుదవారం ఓ లేఖ వ్రాశారు. కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోలుచేయనప్పుడు ఇక మద్దతు ధర ప్రకటించి ప్రయోజనం ఏమిటని లేఖలో ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేంద్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం అమలుచేయడం కూడా సరికాదని పేర్కొన్నారు. పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో పండిన గోధుమలు, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలో పండిన ధాన్యాన్ని పూర్తిగా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుకి దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని సూచించారు. దీనిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆహార, వ్యవసాయ రంగ నిపుణులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకొని వాటి ప్రకారం దేశం అంతటికీ నిర్ధిష్టమైన ఒకే విధానం రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం వలన రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. కనుక ఇకనైనా లోపభూయిష్టమైన ఈ విధానాన్ని మార్చాలని సూచించారు.
ప్రస్తుతం అమలుచేస్తున్న ఈ విధానం జాతీయ ఆహార భద్రత చట్టానికి వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాలు వాటంతట ఆయా రాష్ట్రాలలో పండే ధాన్యం, గోధుమలు తదితర ఆహార ఉత్పత్తులను కొనుగోలు, నిలువ చేసి ఇతర రాష్ట్రాలకు తరలించలేవు కనుకనే రాజ్యాంగం ద్వారా ఈ బాధ్యతను కేంద్రానికి అప్పగించబడిందన్న విషయాన్ని మరిచిపోకూడదని సిఎం కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని సిఎం కేసీఆర్ లేఖలో నొక్కి చెప్పారు.