కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్‌ కోరిన రాష్ట్ర మంత్రులు

తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండిన ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలుచేయాలని కోరేందుకు సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ మంగళవారం ఢిల్లీకి వెళ్ళారు. ముందుగా కేంద్రమంత్రులను తరువాత సంబందిత శాఖల అధికారులను కలిసి మాట్లాడుతామని ఆ తరువాత ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ లభిస్తే ఆయనను కలిసి మాట్లాడుతామని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కేంద్రం పంజాబ్‌ నుంచి ఏవిదంగా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తోందో అదేవిదంగా తెలంగాణ నుంచి కూడా కొనుగోలు చేయాలని కోరుతామని చెప్పారు. ఒకవేళ కేంద్రం నిరాకరిస్తే తదుపరి కార్యాచరణపై సిఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకొంటారని చెప్పారు. 

ఈ సమస్యపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల క్రితమే కేంద్రప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో పండించిన ‘రా రైస్’ మొత్తం తీసుకోగలమని కానీ ‘బాయిల్డ్ రైస్‌’ మాత్రం తీసుకోలేమని చెప్పారు. అయితే యాసంగిలో చేతికొచ్చేది బాయిల్డ్ రైస్‌ మాత్రమే. దానినే తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతోంది. తీసుకోలేమని కేంద్రం పదేపదే చెపుతోంది. అయినా రాష్ట్ర మంత్రులు మళ్ళీ అడిగేందుకు వెళ్ళారు. కనుక వారికి కేంద్రం నుంచి మళ్ళీ అదే సమాధానం వస్తుంది. 

ఇదంతా టిఆర్ఎస్‌ యుద్ధసన్నాహాలలో భాగమే కనుక కేంద్రం చేత నో చెప్పించుకొని వారు తిరిగి రాగానే రాష్ట్రంలో టిఆర్ఎస్‌ ఉద్యమించడం అప్పుడు బిజెపి దానిని బలంగా ఎదుర్కోవడం తధ్యం. ఈ రెండు పార్టీల రాజకీయ ఆధిపత్యపోరులో చివరికి ఏ పార్టీ వ్యూహాలు ఫలించి పైచేయి సాధిస్తుందో తెలియాలంటే 2023 డిసెంబర్‌లో జరుగబోయే ఎన్నికల వరకు ఎదురుచూడవలసిందే.