హైదరాబాద్‌ మెట్రోకి మళ్ళీ మంచి రోజులు షురూ

కరోనాతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్‌ మెట్రోకు మళ్ళీ మంచిరోజులు వచ్చినట్లే కనిపిస్తున్నాయి. కరోనా తీవ్రత పూర్తిగా తగ్గడంతో హైదరాబాద్‌లో ఐ‌టి కంపెనీలనీ మళ్ళీ తెరుచుకొన్నాయి. కనుక ఇనాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దతిలో పనిచేసిన ఐ‌టి ఉద్యోగులు తిరిగివచ్చారు. ఇప్పుడు వేసవి ఎండలు కూడా పెరగడంతో మళ్ళీ అందరూ మెట్రో రైళ్ళు ఎక్కుతున్నారు. దీంతో మళ్ళీ చాలా కాలం తరువాత మెట్రో స్టేషన్లు, రైళ్ళు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. గతంలో అన్ని మెట్రో కారిడర్లలో కలిపి రోజుకి సుమారు 3.5-4 లక్షల మంది వరకు ప్రయాణించేవారు. నేటికీ అంతవరకు చేరుకొనప్పటికీ రోజుకి 2 లక్షల వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. నిన్న సోమవారం ఒక్క ఎల్బీ నగర్‌లోని-మియాపూర్ కారిడార్‌లోనే సుమారు 1.50 లక్షల మంది ప్రయాణించారు. రాబోయే రెండు మూడు నెలల్లో హైదరాబాద్‌లో వేసవి ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయి కనుక అందరూ ఏసీ బోగీలున్న మెట్రోలోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపవచ్చని మెట్రో అధికారులు భావిస్తున్నారు. 

మెట్రో మళ్ళీ కుదుటపడే సూచనలు కనిపిస్తుండగా, టీఎస్‌ఆర్టీసీ మాత్రం డీజిల్ ధరలు పెరగడంతో మళ్ళీ నష్టాల ఊబిలో కూరుకుపోబోతోంది. దీనిని ముందుగానే ఊహించిన టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్‌లో సిటీబస్సులలో సేఫ్టీ సెస్ పేరుతో టికెట్ ఛార్జీలు పెంచేసింది. త్వరలోనే మరోసారి టికెట్ ఛార్జీల పెంపు తప్పకపోవచ్చు.