
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంపై ఘాటుగా స్పందించారు. “కాంగ్రెస్ పార్టీతో నాకు ఎటువంటి పంచాయితీ లేదు. పంచాయతీ అంతా రేవంత్ రెడ్డికి నాకూ మద్యనే. అయినప్పటికీ నాకు ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎటువంటి అభ్యంతరమూ లేదని చాలాసార్లే చెప్పాను. కానీ నేను కోవర్టునంటూ సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయిస్తూ నా ప్రతిష్టను డ్యామేజ్ చేస్తున్నాడు. దీంతో నా పరిస్థితి ముత్యాలముగ్గులో హీరోయిన్ పరిస్థితిలా తయారైంది. పిసిసి అధ్యక్ష పదవికి నేనూ పోటీ పడ్డాను కానీ రేవంత్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టారు. అందుకు నేను బాధపడటం లేదు కానీ రాష్ట్రంలో పార్టీలో మరెవరూ లేరన్నట్లు రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చేస్తుండటం, తనను ప్రశినిస్తున్న వారిపై తన అనుచరుల చేత బురద జల్లించడం నాకు చాలా బాధ కలిగించింది. రేవంత్ రెడ్డి నాకు జలక్ ఇవ్వడం కాదు. నేనే ఆయన బండారం బయటపెట్టి జలక్ ఇస్తాను. ఇంతవరకు జగ్గారెడ్డి అంటే ఏమిటో రేవంత్ రెడ్డికి తెలియలేదు. ఇక ముందు నా తడాఖా చూపిస్తాను,” అని అన్నారు.