
ధాన్యం కొనుగోలుపై సిఎం కేసీఆర్ మళ్ళీ కేంద్రంతో యుద్ధానికి సిద్దం అవడంతో తెలంగాణ బిజెపి ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు సోమవారం ఢిల్లీ వెళ్ళి కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ని కలిసి పరిస్థితిని వివరించారు. కేంద్రప్రభుత్వం తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తోందంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని వారు పీయూష్ గోయల్‌కి తెలియజేశారు.
దీనిపై ఆయన స్పందిస్తూ, “అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచి ఎందుకు కొనుగోలు చేయము? ఈ యాసంగి సీజన్లో కూడా తెలంగాణలో పండిన ‘రా రైస్’ కొంటామని, బాయిల్డ్ రైస్‌కి డిమాండ్ లేదు కనుక కొనలేమని ముందే చెప్పాము. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరిస్తూ సంతకం చేసింది. నిజానికి గత సీజనులో సరఫరా చేస్తానన్న ధాన్యమే ఇంతవరకు ఇవ్వలేకపోయింది. ధాన్యం కొనుగోలుపై రాజకీయాలు చేయడం సరికాదు,” అని అన్నారు.