అవును ప్రశాంత్ కిషోర్ మనతో కలిసి పనిచేస్తున్నారు: కేసీఆర్‌

సోమవారం తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్‌ విస్తృత సమావేశంలో సిఎం కేసీఆర్‌ అనేక ఆసక్తికరమైన విషయాలపై మాట్లాడారు. ఎట్టి పరిస్థితులలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోమని సిఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఐదేళ్ళ పదవీ కాలం పూర్తయిన తరువాతే ఎన్నికలకు వెళతామని, వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌కు 95-105 సీట్లు వస్తాయని సర్వేలలో తేలిందని చెప్పారు. 

ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌తో రహస్య భేటీలపై మీడియాలో వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ఆయన తమతో కలిసి పనిచేస్తున్నారని, దీనిలో దాచుకోవలసింది ఏమీ లేదని ఈ సమావేశంలో సిఎం కేసీఆర్‌ స్పష్టంగా ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్‌ తనకు 8 ఏళ్లుగా స్నేహితుడని సిఎం కేసీఆర్‌ చెప్పారు. దేశ పరిస్థితి, జాతీయ రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న ఆయన నా ఆహ్వానం మేరకు మనతో కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. ఆయన మన వద్ద నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదని చెప్పారు. 

బిజెపి కొత్తగా కాశ్మీర్ ఫైల్స్ పేరుతో సినిమా తీయించి ప్రజల మద్య ఇంకా చిచ్చుపెట్టాలని చూస్తోందని, దీని వలన దేశానికి తీరని నష్టం ఏర్పడుతుందన్నారు. ఇప్పుడు దేశానికి కావలసింది డెవలప్మెంట్ ఫైల్స్ అవసరమని చెప్పారు. తెలంగాణ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని సకల జనుల సమ్మె చేసిన సంగతిని సిఎం కేసీఆర్‌ గుర్తుచేసి, అదేవిదంగా ఇప్పుడు దేశాభివృద్ధి కోసం ప్రజలందరినీ కలుపుకుపోవలసి ఉందన్నారు. 

ప్రశాంతంగా ఉండే బోధన్‌ పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహం పేరుతో బిజెపి మత చిచ్చు రగిలించేందుకు ప్రయత్నిస్తోందని సిఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న బిజెపిని గద్దె దించాల్సిందేనని అన్నారు. జాతీయ స్థాయిలో బిజెపికి బలమైన ప్రత్యామ్నాయం లేనందున రాజకీయ శూన్యత ఉందని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం మాత్రమే తాను జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనుకొంటున్నానని అందుకే ప్రశాంత్ కిషోర్‌ తనతో కలిసి పనిచేసేందుకు అంగీకరించారని సిఎం కేసీఆర్‌ తెలిపారు.    

కేంద్రాన్ని ప్రశ్నిస్తే తనపై ఈడీ, ఐ‌టి దాడులు జరుగుతాయని సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలపై కూడా ఘాటుగా స్పందించారు. తాను అటువంటి తాటాకు చప్పుళ్ళకు భయపడేవాడిని కాదని, భయపడేవాడినే అయితే తెలంగాణ ఉద్యమం చేసేవాడినే కాదని సిఎం కేసీఆర్‌ అన్నారు. 

చిన్న జీయర్ స్వామితో తనకు ఎలాంటి విభేధాలు లేవని మీడియాలో వస్తున్నవన్నీ పుకార్లే అని సిఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.