నేడు బోధన్ బంద్‌...అనుమతి లేదు

నిజామాబాద్‌ జిల్లా బోధన్ పట్టణంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద బిజెపి అధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడంపై ఓ వర్గంవారు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో నిన్న పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విగ్రహం తొలగించాలని ఒక వర్గం, వీల్లేదని బిజెపి శ్రేణులు ఎదురెదురుగా రోడ్డుపై బైటాయించి నినాదాలు చేశారు. ఇరువర్గాల మద్య వాదోపవాలతో మొదలైన ఘర్షణ పరస్పరం రాళ్ళతో దాడులు చేసుకొనే వరకు వెళ్లింది. 

సమాచారం అందుకొన్న నిజామాబాద్‌ సీపీ నాగరాజు, సీఐ, ఎస్సైలతో అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేసె ప్రయత్నం చేశారు. విగ్రహం ఏర్పాటుకి అనుమతి లేకపోతే తొలగిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఓ వర్గంవారు శాంతించి వెళ్ళిపోయారు. కానీ విగ్రహం తొలగిస్తామని వారికి హామీ ఇచ్చినందుకు బిజెపి శ్రేణులు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై దాడికి ప్రయత్నించారు. 

పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా వారు వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు. లాఠీ ఛార్జీలో బిజెపికి చెందిన పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఉద్రిక్తతల నేపధ్యంలో నేడు బోధన్ పట్టణంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీపీ నాగరాజు ప్రకటించారు. అంబేడ్కర్ చౌరస్తా పరిసర ప్రాంతాలలో వందమంది పోలీసులను కూడా మోహరించారు. 

పోలీసులు తమ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ నేడు బోధన్ బంద్‌కు బిజెపి పిలుపునిచ్చింది. అయితే బంద్‌కు అనుమతి లేదని ఎవరైనా బలవంతంగా దుకాణాలు మూసివేసేందుకు, వాహనాలను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు.