
తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శనివారం అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నారు. మంత్రి కేటీఆర్ అమెరికాలో పది రోజులు పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలను రప్పించేందుకు కృషి చేస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాలుపంచుకోవలసిందిగా అమెరికాలో స్థిరపడిన తెలంగాణవాసులను మంత్రి కేటీఆర్ కోరనున్నారు.
మంత్రి కేటీఆర్‌తో పాటు ఐటి, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపూరి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ అమెరికాకు వెళుతున్నారు.
కేటీఆర్ బృందం ముందుగా లాస్ ఏంజిలిస్ నగరం నుంచి పర్యటన ప్రారంభిస్తుంది. మార్చి 20న శాండియాగో, 21న శాన్‌జోన్, 24న బోస్టన్, 25న న్యూయార్క్‌లో పర్యటిస్తారు. ఈ నెల 29వరకు అమెరికాలో వారి పర్యటన కొనసాగుతుంది.