
హైదరాబాద్ పోలీసులు ఎంత క్లిష్టమైన కేసులనైనా కొన్ని గంటల వ్యవధిలోనే చాలా చాకచక్యంగా ఛేదిస్తుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే పేరుతో ఉన్న వాహనం నడిరోడ్డుపై ఓ మహిళను గుద్దినప్పుడు ఆ మహిళ చేతిలో చిన్నారి కిందపడి చనిపోయినా ఆ కేసును ఇంతవరకు చేధించలేకపోతున్నారు!
గురువారం రాత్రి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో భోదన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ మహమ్మద్ పేరుతో స్టిక్కర్ అంటించిన ఓ వాహనం రోడ్డు పక్కనే భిక్షాటన చేసుకొనే కాజల్ చౌహాన్ అనే మహిళను ఢీకొంది. అప్పుడు ఆమె చేతిలో ఉన్న రెండున్నర నెలల వయసున్న ఆమె కుమారుడు రణవీర్ చౌహాన్ నేలపై పడటంతో తలకు గాయమై చనిపోయాడు. ఈ ప్రమాదంలో కాజల్ పక్కనే సారిక చౌహాన్, సుష్మా భోంస్లే, అశ్వతోష్ అనే మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. వారందరూ దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జి వద్ద బెలూన్స్ అమ్ముకొంటూ భిక్షాటన చేసుకొని జీవిస్తుంటారు. వారందరినీ పోలీసులు నీమ్స్ హాస్పిటల్కు తరలించారు.
పోలీసులు ఆ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా రవాణాశాఖలో విచారించగా దానిని గత ఏడాది అక్టోబరులో నిజామాబాద్లో కొన్నట్లు తెలిసింది. అది కింగ్ కోఠిలోని మీర్జాకు చెందిన అర్బన్ ట్రాన్స్పాస్పోర్ట్ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. ప్రస్తుతం దుబాయిలో ఉన్న ఎమ్మెల్యే షకీల్ మొదట ఆ వాహనం తనది కాదని చెప్పి పోలీసుల నుంచి ఫోన్ వచ్చిన తరువాత దానిని తన కజిన్ బ్రదర్ వాడుతుంటాడని అందుకే దానిపై తన పేరుతో స్టిక్కర్ ఉందని చెప్పడం విశేషం. ప్రమాదం జరిగినప్పుడు ఆ కారులో మీర్జా కుటుంబం ఉందని, వారు జనం కొడతారనే భయంతో అక్కడి నుంచి పారిపోయి వచ్చి తనకు ఫోన్ చేసి చెప్పారని ఎమ్మెల్యే షకీల్ చెప్పారు.
గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగిన చోట అనేక సిసి కెమెరాలు ఉన్నప్పటికీ పోలీసులు నిందితులను గుర్తించలేకపోవడం ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఈ వార్త మీడియాలో హైలైట్ అవుతుండటంతో పోలీసులు మీర్జాను అదుపులోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. నీమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కాజల్ చౌహాన్తో సహా ముగ్గురు బాధితులు శుక్రవారం మధ్యాహ్నం పారిపోవడం మరో విడ్డూరం.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కారుతో ఈ ప్రమాదం జరిగింది కనుకనే ఇటువంటి చిత్రవిచిత్రాలన్నీ జరుగుతున్నాయని వేరే చెప్పక్కరలేదు. అయితే చివరిగా రెండు ప్రశ్నలు. ఒక ఎమ్మెల్యే కారుకి రవాణాశాఖ అధికారులు ప్రత్యేక గుర్తింపు స్టిక్కర్ను ఆయన బందుమిత్రులందరూ తమతమ వాహనాలపై అంటించుకొని దర్జాగా తిరగవచ్చా? హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ‘బాధితులు’ ఎందుకు పారిపోయారు? వారిని ఎవరైనా భయపెట్టారా...డబ్బు ముట్టజెప్పి పారిపొమ్మని చెప్పారా?