
దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలలో పంజాబ్ ఒకటి. కానీ నేటికీ ఆ రాష్ట్రం అనేకానేక సమస్యలతో సతమతమవుతోంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రాన్ని పాలించిన అకాలీదళ్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు వాటిని పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించాయి. దీంతో పంజాబ్ ప్రజలు ఆమాద్మీ పార్టీవైపు మొగ్గు చూపారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ 117 స్థానాలకి 92 స్థానాలు గెలుచుకొని తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.
నేడు పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ఆమాద్మీ నేత భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించి సర్దార్ భగత్ సింగ్ జన్మస్థలమైన ఖట్కర్ కలాన్ భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆమాద్మీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. దీంతో నేటి నుంచి పంజాబ్ రాజకీయాలలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇంతవరకు ఢిల్లీకే పరిమితమైన ఆమాద్మీ వంటి ఓ చిన్న ప్రాంతీయ పార్టీ ఢిల్లీకి వెలుపల కాంగ్రెస్, బిజెపి, అకాలీదళ్ పార్టీల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న పంజాబ్లో భారీ మెజార్టీతో విజయం సాధించడం విశేషం.