టిఆర్ఎస్‌ నిశబ్ధానికి కారణం అదేనా?

యూపీతో సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నంత కాలం సిఎం కేసీఆర్‌ మొదలు టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రధాని నరేంద్రమోడీ, బిజెపిలపై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకు పడటం అందరూ చూశారు. కానీ ఎన్నికలు పూర్తవగానే అందరూ ‘సైలెంట్ మోడ్‌’లోకి వెళ్ళిపోవడం విశేషం. ఇప్పుడు ఎవరూ పెద్దగా కేంద్రాన్ని విమర్శించడం లేదు. వారి నిశబ్ధానికి కారణం నాలుగు రాష్ట్రాలలో బిజెపి గెలిచి అధికారంలోకి రావడమే కావచ్చు. 

ఈ ఎన్నికలలో..ముఖ్యంగా యూపీలో బిజెపి ఈసారి ఓడిపోతుందని సిఎం కేసీఆర్‌ స్వయంగా జోస్యం చెప్పడంతో టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వంతపాడారు. ఒకవేళ ఒక్క యూపీలో మాత్రమే బిజెపి ఓడిపోయినా వారు గట్టిగా మాట్లాడేవారేమో? కానీ వారి అంచనాలకు భిన్నంగా యూపీతో సహా నాలుగు రాష్ట్రాలలో బిజెపి గెలవడంతో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. అంతేకాదు...ఈ ఎన్నికలు ఫలితాలు సిఎం కేసీఆర్‌ ‘ఫ్రంట్ ఏర్పాటు’పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండవచ్చు. 

ఏది ఏమైనప్పటికీ, బిజెపి ఘన విజయం సాధించి విజయోత్సాహంతో ఉన్నప్పుడు మాట్లాడి నవ్వుల పాలవడంకంటే ఈ వేడి కాస్త తగ్గిన తరువాత మాట్లాడవచ్చని టిఆర్ఎస్‌ సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయుండవచ్చు.