
ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన సిఎం కేసీఆర్ను వారం రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని యశోదా హాస్పిటల్ వైద్యులు సూచించినప్పటికీ, నేడు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారు. నేటితో బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి కనుక నేడు ఉభయసభలలలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. అనంతరం దీనిపై జరిగిన చర్చలలో సభ్యులు లేవనెత్తిన సందేహాలు, విపక్ష సభ్యులు చేసిన విమర్శలకు సిఎం కేసీఆర్ సమాధానం చెపుతారు. ద్రవ్యవినిమయ బిల్లుకి ఆమోదం తెలిపిన తరువాత ఉభయసభలు నిరవదికంగా వాయిదా పడతాయి.
ఈసారి ఆనవాయితీకి విరుద్దంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగా, తొలిరోజునే ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్లను ఈ సమావేశాలు ముగిసేవరకు సభ నుంచి సస్పెండ్ చేయడం మరో విశేషం.