1.jpg)
నేటితో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. కనుక సమావేశాలలో ప్రతీరోజు బడ్జెట్‌పై అర్ధవంతమైన చర్చ జరగాలని అందరూ ఆశిస్తారు. కానీ మద్యలో అధికార, ప్రతిపక్షాల పరస్పర విమర్శలు, ఆరోపణలతో విలువైన కాలం వృధా అయిపోతుంటుంది. సోమవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ జరుగుతున్నప్పుడు ఇదే జరిగింది.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గం సమస్యల పరిష్కారానికి ఏమి చేశారో... చేస్తున్నారో తెలీదు. కానీ శాసనసభలో ఆ అవకాశం వచ్చినప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడేబదులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఆరోపణలతో కాలక్షేపం చేశారు. కాంట్రాక్టులలో అవినీతిపై ఆయన చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
“కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బయట సిఎం కేసీఆర్ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారు. బయట ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సభలో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సభలో బడ్జెట్‌పై చర్చించకుండా మా ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. అవినీతి ఆరోపణలు చేయడం కాదు వాటిని నిరూపించాలి. ఒకవేళ మీ వద్ద ఆధారాలుంటే దర్యాప్తు చేయడానికి ఏసీబీ, విజిలెన్స్, న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిని ఆశ్రయించి మీ ఆరోపణలు నిరూపించుకోవచ్చు కదా?అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి మారుపేరు. పాతాళం నుంచి అంతరిక్షం వరకు ప్రతీపనిలో అవినీతికి పాల్పడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను,” అని అన్నారు.