సిఎం కేసీఆర్‌కు సర్వైకల్ స్పాండిలోసిస్

ఇటీవల సిఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురవడంతో యశోదా హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకొన్నారు. యశోదా మెడికల్ సర్వీసస్ చీఫ్ డాక్టర్ విష్ణు రెడ్డి, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్‌ మీడియాకు సిఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. 

సిఎం కేసీఆర్‌కు ఈసీజీ, 2డి ఈకో, యాంజియో చేశామని వాటిలో గుండెకు సంబందించి ఎటువంటి సమస్యలు కనబడలేదని తెలిపారు. తరువాత సిఎం కేసీఆర్‌కు మెడ, బ్రెయిన్ ఎంఆర్ఐ పరీక్షలు చేయగా దానిలో మెడ భాగంలో కొంత సమస్య ఏర్పడినట్లు గుర్తించామని తెలిపారు. దీనిని వైద్య పరిభాషలో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దీని కారణంగానే సిఎం కేసీఆర్‌కు ఎడమ చెయ్యి లాగుతున్నట్లు అనిపిస్తుంటుందని అన్నారు. దీని కోసం ఆయన కొంతకాలం మెడకు సపోర్టుగా పట్టీ ధరించవలసి ఉంటుందని తెలిపారు. సిఎం కేసీఆర్‌ షుగర్, బీపీ అదుపులోనే ఉన్నాయని ఇక ముందు కూడా అవి అదుపులో ఉండేలా మందులు వాడుతూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు తెలిపారు. ఇకపై తరచూ ఆయనకు బీపీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించాలని సూచించామని తెలిపారు. ఇటీవల సిఎం కేసీఆర్‌ వరుసగా జిల్లా పర్యటనలకు వెళ్ళి అనేక అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూ, సభలకు హాజరవుతూ ప్రసంగాలు చేస్తుండటం వలన కొంచెం నీరసించారని సిఎం కేసీఆర్‌ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. కొద్దిగా నీరసం, చెయ్యి నొప్పి తప్ప సిఎం కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నారని తెలిపారు.