కంటోన్మెంట్ వేదికగా టీఆర్ఎస్-బీజేపీ మద్య మరో కొత్త యుద్ధం?

టిఆర్ఎస్‌, బిజెపిల మద్య ఇప్పటికే చాలా జోరుగా రాజకీయ ఆధిపత్యపోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు  హైదరబాద్ కంటోన్మెంట్ వేదికగా మరో కొత్త యుద్ధం మొదలవబోతోంది. కంటోన్మెంట్ ఏరియా రక్షణశాఖ అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. కనుక అక్కడ కంటోన్మెంట్ అధికారుల కనుసన్నలలో పనులు జరుగుతుంటాయి. 

ఈరోజు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కార్వాన్ నియోజకవర్గంలో నాలాల సమస్యపై స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొయిద్దీన్ అడిగిన ప్రశ్నకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జవాబిస్తూ, “కంటోన్మెంట్లో చెక్ డ్యామ్ కట్టి నీటిని నిలువచేస్తుండటంతో నదీమ్ కాలనీ నీట మునుగుతోంది. శాతం చెరువు నుంచి నీళ్ళు తీసుకొని గోల్కొండ దిగువకు నీటిని విడుదల చేద్దామనుకొంటే ఏఎస్ఐ అడ్డుపడుతోంది. కంటోన్మెంట్ అధికారులు ఇలా అడుగడుగునా సమస్యలు సృష్టిస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుంటే మేము చూస్తూ ఊరుకోము. ఈ సమస్యలపై స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడాలని ఆదేశిస్తాను. ఒకవేళ కంటోన్మెంట్ అధికారులు వినకపోతే అవసరమైతే కంటోన్మెంట్‌కి నీళ్ళు, విద్యుత్ సరఫరా బంద్‌ చేస్తాము. అప్పుడైనా దిగి వస్తారు కదా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రప్రభుత్వం, బిజెపిలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.    

కంటోన్మెంట్‌ సమస్యలను మంత్రి కేటీఆర్‌ బిజెపి, కేంద్రప్రభుత్వంతో ముడిపెట్టి మాట్లాడి, కంటోన్మెంట్‌కు నీళ్ళు, విద్యుత్ సరఫరా బంద్‌కు చేస్తామని హెచ్చరించినందుకు ఇప్పుడు కంటోన్మెంట్‌ వేదికగా టిఆర్ఎస్‌, బిజెపిల మద్య మరో కొత్త యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.