పాక్‌లోకి దూసుకు వెళ్ళిన భారత్‌ క్షిపణి

భారత్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6.50 గంటలకు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో కూలిపోయింది. ఈ ఘటనపై పాక్‌ విదేశాంగ శాఖ పాక్‌లోని భారత్‌ రాయబారిని పిలిపించుకొని తీవ్ర నిరసన తెలియజేసింది. భారత్‌ క్షిపణి పడటం వలన ఆ గ్రామంలో అనేక ఇళ్ళు దెబ్బ తిన్నాయని తెలిపింది. భారత్‌ విమానాలు తరచూ తమ గగనతలంలోకి చొచ్చుకువస్తూ అతిక్రమణకు పాల్పడుతున్నాయని పాక్‌ ఆరోపించింది. అయితే ఆ క్షిపణికి వార్ హెడ్ (బాంబు) బిగించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  

ఈ ప్రమాదాన్ని భారత్‌ ప్రభుత్వం కూడా దృవీకరించి తీవ్ర విచారం వ్యక్తం చేసింది. క్షిపణుల నిర్వహణ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భారత్‌ రక్షణశాఖ తెలిపింది. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించింది. 

పాక్‌ ఆరోపణల ప్రకారం...రాజస్తాన్ రాష్ట్రంలో సూరత్‌ఘడ్‌ సమీపంలోని సిర్సా నుంచి మార్చి 9వ తేదీ సాయంత్రం 6.43 గంటలకు ఓ క్షిపణి నింగిలోకి దూసుకుపోయింది. అది 3.44 నిమిషాల పాటు ప్రయాణించి భూమికి 40వేల అడుగుల ఎత్తుకు చేరుకొన్న తరువాత పేలిపోయింది. దాని శిధిలాలు పాక్‌ భూభాగంలో కూలిపోయాయి. అది సిర్సాలో బయలుదేరినప్పటి నుంచి పాక్‌ ఎయిర్ డిఫెన్స్ నిశితంగా గమనిస్తూనే ఉంది. అది కొంత దూరం ప్రయాణించిన తరువాత హటాత్తుగా పాక్‌ వైపు పయనించి ఆకాశంలోనే పేలిపోయింది,” అని పాక్‌ ఇంటర్ సర్వీసస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ తెలిపింది. భారత్‌ క్షిపణి పయనించిన రూట్  మ్యాప్‌ను కూడా విడుదల చేసింది.

ఒకేవేళ పాక్‌ వాయుసేన భారత్‌ తమపై క్షిపణి దాడి చేస్తోందని భావించి వెంటనే ఎదురుదాడి చేసి ఉంటే భారత్‌-పాక్‌ మద్య హటాత్తుగా యుద్ధం మొదలైపోయి ఉండేది. కానీ ఇటువంటి సమయంలో పాక్‌ సంయమనం పాటించడంతో పెను ప్రమాదం తప్పిపోయింది.