
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ, లడాఖ్ లోని లేహ్ ప్రాంతాలను కలుపుతూ సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో రోహతాంగ్ వద్ద నిర్మించిన అటల్ టన్నల్ గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో నిర్మించిన అతి పొడవైన టన్నల్‌గా గిన్నీస్ రికార్డులలోకి ఎక్కింది. ఈ మేరకు గిన్నీస్ సర్టిఫికేట్ అందజేసినట్లు రక్షణశాఖ తెలిపింది.
అత్యంత క్లిష్టమైన వాతావరణంలో హిమాచల్ ప్రదేశ్ పీర్ పంజాల్ పర్వతశ్రేణిలో 10,000 అడుగుల ఎత్తులో కొండలను తొలిచి బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ దీనిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించింది. దీని పొడవు 9.02 కిమీ. ఈ సొరంగ మార్గాన్ని 2020, అక్టోబరులో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేశారు.