హిజాబ్, కాషాయ కండువాలు రెండూ వద్దు: హైకోర్టు

కర్ణాటక విద్యాసంస్థలలో హిజాబ్ వివాదంపై దాఖలైన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. దీనిపై తుది తీర్పు వెలువడేవరకు విద్యాసంస్థలలో ఎవరూ మతపరమైన దుస్తులు అంటే హిజాబ్, కాషాయ కండువాలు ధరించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చాలా సున్నితమైన అంశం కనుక విద్యార్దులు కూడా సహకరించాలని కోరింది. దీనిపై ముస్లిం విద్యార్ధినుల తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఈ కేసుపై విచారణ పూర్తయ్యేవరకు అందరూ మద్యంతర ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఫిబ్రవరి 14 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు తెరిచేందుకు హైకోర్టు అనుమతించింది. 

ఇదే సమస్యపై తమిళనాడులో ఉద్రిక్తతలు నెలకొనడంతో మద్రాస్ హైకోర్టులో కూడా పిటిషన్‌ దాఖలైంది. దానిపై విచారణ చేపట్టిన యాక్టిగ్ చీఫ్ జస్టిస్ ఎంఎన్ బండారి, జస్టిస్ డి.భరత్‌ చక్రవర్తిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. “మనకి దేశం ముఖ్యమా.. మతం ముఖ్యమా? విద్యాసంస్థలలో ఇటువంటి ఘటనలు జరుగుతుండటం చాలా బాధాకరం. మనది సెక్యులర్ దేశం. కానీ ఈవిదంగా మతం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నాలు జరుగుతుండటం చాలా దురదృష్టకరం. దీనిని ఎంత మాత్రం సమర్ధించలేము,” అని అంది. 

హిజాబ్ వివాదంలో జోక్యం చేసుకోవాలంటూ సీనియర్ కాంగ్రెస్‌ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ ఈ కేసును కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోంది కనుక ఈ దశలో జోక్యం చేసుకోలేమని, అవసరమైతే తరువాత విచారణ చేపడతామని స్పష్టం చేసింది.