16.jpg)
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు జనగామ చేరుకొని అక్కడ కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తరువాత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో జిల్లాకు సంబందించిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంతాపూర్ వద్ద కొత్తగా నిర్మించిన టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జనగామలో టిఆర్ఎస్ అధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
సిఎం కేసీఆర్ నేడు జనగామలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నందున మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలుకుతూ జనగామలో స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. జనగామ పట్టణం టిఆర్ఎస్ పార్టీ జెండాలతో గులాబీమయం అయ్యింది. సిఎం కేసీఆర్ సభ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈరోజు సభకు టిఆర్ఎస్ శ్రేణులు భారీగా జనసమీకరణ చేశారు. కనీసం లక్ష నుంచి లక్షా ముప్పై వేలుమంది హాజరవవచ్చని అంచనా వేసి తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్రంపై టిఆర్ఎస్ యుద్ధం ప్రకటించిన తరువాత తొలిసారిగా సిఎం కేసీఆర్ జనగామలో బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. కనుక కేంద్రంపై మరోసారి విరుచుకుపడటం ఖాయం. కానీ సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడంపై ఈరోజు సభలో ఏమైనా స్పష్టత ఇస్తారో లేదో చూడాలి.