హైదరాబాద్‌కు పాకిన హిజాబ్ ఆందోళనలు

కర్నాటకలో మాండ్యలో ఓ కాలేజీలో మొదలైన హిజాబ్ (ముస్లిం మహిళలు తలపై ధరించే వస్త్రం) వివాదం, దానిపై ఆందోళనలు క్రమంగా దేశమంతటా పాకుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కోల్‌కతా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో దీనిపై అనుకూల, వ్యతిరేక ఆందోళనలు నడుస్తుండగా ఇప్పుడు హైదరాబాద్‌ పాతబస్తీలో కూడా మొదలయ్యాయి. నగరంలోని నిజామియా యునానీ టిబ్బి కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్ధినులు హిజాబ్ ధరించి, ప్లకార్డులు పట్టుకొని బుదవారం ఛార్మినార్ వద్ద ర్యాలీ నిర్వహించారు. కర్నాటకలోని కొన్ని కాలేజీలు ముస్లిం విద్యార్ధినులు హిజాబ్‌ ధరించవద్దని నిషేదం విధించడాన్ని తప్పు పడుతూ ‘హిజాబ్ ధరించడం మా హక్కు,’ అంటూ నినదించారు.

కర్నాటకలో కొన్ని కాలేజీలు హిజాబ్‌ను నిషేదించడాన్ని సవాలు చేస్తూ కొందరు విద్యార్ధినులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ వేయగా దానిపై త్రిసభ్య ధర్మాసనం ఇవాళ్ళ విచారణ చేపట్టనుంది.

హిజాబ్ ధరించడానికి మద్దతు పలుకుతూ కాంగ్రెస్‌ నేత ప్రియాంకా వాద్రా చేసిన వ్యాఖ్యలు మరో కొత్త వివాదానికి దారి తీశాయి. “ఆడపిల్లలు ఏమి ధరించాలనే స్వేచ్చ వారికి రాజ్యాంగం ఇచ్చింది. వారు బికినీ..ఘూంఘట్‌.. జీన్స్‌.. హిజాబ్‌.. ఇలా ఏదైనా తమకు నచ్చినవి ధరించవచ్చు. కనుక దీనిపై రాజకీయాలు, చర్చలు కట్టి పెట్టాలీ,” అని అన్నారు. ఆమె ఆడపిల్లలు బికినీ ధరించి కాలేజీలకు వెళ్ళవచ్చని సూచిస్తున్నారంటూ విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

నేటి నుంచి యూపీ శాసనసభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈసారి యూపీలో బిజెపికి ఎదురుగాలి వీస్తోంది కనుక యూపీ ఎన్నికలలో హిందూ ఓటర్లకు గాలం వేసేందుకే బిజెపి ఈ వివాదం సృష్టించి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. సరిగ్గా యూపీ ఎన్నికలు మొదలయ్యే ముందు బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటకలోనే ఈ వివాదం మొదలవడమే ఈ అనుమానాలకు తావిస్తోంది.