జమ్ముకశ్మీర్‌లో రియాసీ జిల్లాలో చినాబ్ నదిపై ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని రైల్వేశాఖ నిర్మిస్తోంది. సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో చినాబ్ నదిపై ఓ ఆర్చిని నిర్మించి దానిపై 1315 మీటర్ల పొడవైన రైల్వే ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఆర్చి నిర్మాణం పూర్తయింది. సాధారణంగా విమానాలు మాత్రమే మబ్బులపైన వెళుతుంటాయి. కానీ ఇక్కడ ఆ ఆర్చి ఎంత ఎత్తుగా ఉంటుందంటే దాని కింద నుంచి మేఘాలు పయనిస్తుంటాయి. ఆ ఫోటోలను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కశ్మీర్‌ను భారత్‌లోని ఇతర రాష్ట్రాలతో అనుసంధానించేందుకుగాను ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లాలను కలుపుతూ రూ.28,000 కోట్ల వ్యవయంతో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా దీనిని నిర్మిస్తున్నారు. ఈ ఒక్క బ్రిడ్జి నిర్మాణానికే రూ.1,250 కోట్లు ఖర్చు అవుతోంది. ఈ రైల్వే బ్రిడ్జిపై మేఘాలలో తేలిపోతూ రైల్లో ప్రయాణించడం చాలా మధురానుభూతి కల్పించడమే కాక అంత ఎత్తులో ప్రయాణించడం ఒళ్ళు గగుర్పొడుస్తుంది. బ్రిడ్జి నిర్మాణంలో కీలకమైన ఆర్చి బిగించడం పూర్తయినందున ఇప్పుడు దానిపై వంతెన నిర్మించి దానిపై రైల్వే ట్రాక్ ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది చివరిలోగా ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావచ్చు.