
కాంగ్రెస్ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే హడావుడిగా, అనాలోచితంగా ఏపీ రాష్ట్ర విభజన చేసిందన్న ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలపై టిఆర్ఎస్ పార్లమెంటరీ నేత, కె.కేశవరావు తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో టిఆర్ఎస్ ఎంపీలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ సాధన కోసం దశాబ్ధాలపాటు ప్రజలు చేసిన పోరాటాల కారణంగానే అప్పటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజనకు ముందు వివిద పార్టీలు, వివిద వర్గాలతో సుదీర్గ మంతనాలు జరిపి అందరి అభిప్రాయాలు సేకరించింది. వారి అభిప్రాయాలకు అనుగుణంగానే రాష్ట్ర విభజన బిల్లును తయారుచేసి లోక్‌సభలో ప్రవేశపెట్టి అందరి ఆమోదంతో ఆమోదించింది. దానికి బిజెపి కూడా మద్దతు ఇచ్చింది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇంత పద్దతిగా రాష్ట్ర విభజన జరిగితే అది తొందరపాటుతో జరిగిందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పడాన్ని నేను ఖండిస్తున్నాను,” అని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ ఏర్పాటు గురించి మాట్లాడటం చాలా అసందర్భంగా ఉంది,” అని కె.కేశవరావు అన్నారు.