నిరసనలతో హోరెత్తుతున్న తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ చాలా రోజుల తరువాత ఆందోళనలతో అట్టుడికిపోతోంది. రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్‌ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు తెలియజేయాలని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కేటీఆర్‌ ఆదేశం మేరకు టిఆర్ఎస్‌ శ్రేణులు జిల్లా, మండల స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు, బైక్‌పై ర్యాలీలు చేసి ప్రధాని నరేంద్రమోడీ, బిజెపిల దిష్టి బొమ్మలను దగ్ధం చేసి నిరసనలు తెలుపుతున్నారు. కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల కార్యకర్తలు కూడా వేర్వేరుగా నిరసనలు చేపట్టారు.   

మరోపక్క సింగరేణిలో నాలుగు బొగ్గు గనుల వేలం వేయాలనే కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ, సింగరేణి కార్మికులు నిరసనలు తెలియజేస్తున్నారు. టిఆర్ఎస్‌ అనుబంద కార్మిక సంఘం టిబిజికెఎస్, ఏఐటియుసీ అనుబందంగా పనిచేస్తున్న ఎస్‌సిడబ్ల్యూయు తదితర కార్మిక సంఘాలు కూడా నేడు నిరసనలు తెలియజేస్తున్నాయి. 

ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలపై టిఆర్ఎస్‌ నిరసనలు ఇవాళ్ళ ఒక్కరోజుకే పరిమితం కావచ్చు కానీ సింగరేణి నిరసనలు కొనసాగే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలు అంశంపై టిఆర్ఎస్‌ను బిజెపి నేతలు బలంగా ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలు చేస్తున్న ఈ నిరసనలు రాష్ట్ర బిజెపి నేతలకు చాలా ఇబ్బందికరంగా మారాయని చెప్పవచ్చు. టిఆర్ఎస్‌ విసురుతున్న ఈ సవాలును బిజెపి ఏవిదంగా అదిగమిస్తుందో చూడాలి.