మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ నేడు టిఆర్ఎస్‌ నిరసనలు

రాష్ట్ర విభజన తొందరపాటు నిర్ణయమంటూ ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై ఊహించినట్లే టిఆర్ఎస్‌ తీవ్రంగా స్పందించింది. ప్రధాని వ్యాఖ్యలపై తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ టిఆర్ఎస్‌ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా  ప్రధాని వ్యాఖ్యలకు నిరసనలు తెలియజేయాలని, బిజెపి దిష్టి బొమ్మలను దగ్దం చేయాలని కోరారు. 


“ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలు తెలంగాణ కోసం జరిగిన దశాబ్దాల పోరాటాలను, బలిదానాలను కించపరిచేవిదంగా ఉన్నాయి. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను,” అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు. 

మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రా రెడ్డి తదితరులు కూడా ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. 

కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఏమీ సాయం చేయకున్నా రాష్ట్ర విభజన తరువాత సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని, కానీ ప్రధాని మోడీ రాష్ట్ర విభజన సరికాదన్నట్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను, వారి పోరాటాలను, బలిదానాలను పదేపదే అవమానిస్తున్నారని మంత్రులు అన్నారు. సిఎం కేసీఆర్‌ రాష్ట్రాల హక్కులు, అధికారాల గురించి కేంద్రాన్ని నిలదీయడాన్ని జీర్ణించుకోలేకనే ప్రధాని నరేంద్రమోడీ ఈవిదంగా రాష్ట్రంపై విషం కక్కుతున్నారని అన్నారు. తెలంగాణను అవమానించినవారందరూ మట్టి కరిచారని రేపు బిజెపికి కూడా ఇదే జరుగబోతోందని మంత్రులు అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణను... ప్రజలను కించపరుస్తూ మాట్లాడుతుంటే రాష్ట్రంలో బిజెపి నేతలు ఏ మొహం పెట్టుకొని తిరుగుతారని ప్రశ్నించారు.