
త్వరలో జరుగబోయే ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో యోగీ ఆధిత్యనాధ్ నేతృత్వంలో అధికార బిజెపి ఓడిపోబోతోందని తెలిసే ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీని తిడుతూ కొత్త డ్రామా ప్రారంభించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని చెపుతున్న ప్రధాని నరేంద్రమోడీ, తమ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పగలరా? దేశాన్ని, ప్రజలను కులమతాల వారీగా విభజిస్తూ పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి ముచ్చింతల్‌లో సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నైతిక హక్కే లేదు.
ఈ ఏడేళ్ళలో తెలంగాణకు ఏమీ చేయకపోయినా, ఇవ్వకపోయినా రాష్ట్ర విభజన వలన రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ ప్రధాని నరేంద్రమోడీ మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేసి అప్పుడే తెలంగాణ పట్ల తన వివక్ష చాటుకొన్నారు. ఇప్పుడు సింగరేణి బొగ్గు గనులను వేలం వేసి సింగరేణిని కూడా లాక్కొనేందుకు చూస్తున్నారు. కానీ సింగరేణి జోలికి వస్తే బిజెపిని రాష్ట్రం నుంచి తరిమి కొడతాము. రాజ్యాంగం గురించి సిఎం కేసీఆర్ చేసిన సూచనపై కాంగ్రెస్, బిజెపిలు చర్చించకుండా కుక్కలా మొరుగుతున్నాయి. తెలంగాణకు అన్ని విదాలా అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీని బాయ్‌కాట్ చేస్తే తప్పేమిటి?” అని అన్నారు.