1.jpg)
దేశానికి పట్టిన చీడ, పీడ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ లేకుంటే దేశం ఎప్పుడో బాగుపడేదని, ఏపీ విభజన చేసినా కాంగ్రెస్ పార్టీని రెండు రాష్ట్రాలలో ప్రజలు నమ్మకపోవడం వలన ఓడిపోయిందని ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై అప్పుడే తెలంగాణలో ప్రతిస్పందనలు మొదలైపోయాయి.
సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటులో ఒప్పుకొన్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. తెలంగాణ ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదని దాంతో నష్టపోయిందని ప్రధాని మోడీ అన్నారు. మరి బిజెపి విభజించిన మూడు రాష్ట్రాలలో ఆ పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది?మోడీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం. కరోనా వస్తే ప్రజల చేత చప్పట్లు కొట్టించి, దీపాలు వెలిగింపజేశారు. కానీ కరోనా ఆగలేదు. దేశవ్యాప్తంగా లక్షలాదిమందిని పొట్టనపెట్టుకొంది.
ఈ ఏడేళ్లలో మోడీ ప్రభుత్వం ఏమి చేసిందంటే రైతులను నిలువునా ముంచి బడా పారిశ్రామిక వేత్తలకు మేలు చేయడం. కాంగ్రెస్ పార్టీ ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి వాటిలో పనిచేసే ఉద్యోగులను రోడ్డున పడేసి దేశంలో నిరుద్యోగం ఇంకా పెంచడం, చమురు, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేసి సామాన్యుల నడ్డి విరిచేయడం మినహా ఏమి చేయగలిగింది?
దేశానికి స్వాత్రంత్ర్యం సాధించిన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ప్రధాని నరేంద్రమోడీ తుక్డే తుక్డే (ముక్కముక్కల) పార్టీ అని సంభోదించడాన్ని ఖండిస్తున్నాను. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి కట్టుబడి, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ. ఏ రాజకీయ పార్టీకైనా ఎత్తుపల్లాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ కోలుకొని కేంద్రంలో, రాష్ట్రంలో తప్పక అధికారంలోకి వస్తుంది,” అని అన్నారు.