.jpg)
రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాదాలు తెలిపే చర్చలో ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీ వలననే దేశం నేటికీ ఇంత వెనకపడిపోయిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అసమర్దత, అవీనీతి, బంధు ప్రీతి, అహంకారం వలననే దేశంలో నేటికీ అనేక మంది ప్రజలు నీళ్ళు, విద్యుత్, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. కాంగ్రెస్ అహంకారానికి అదీ చాలా నష్టపోయింది. కానీ నేటికీ కాంగ్రెస్ పార్టీ అహంకారం ఏమాత్రం తగ్గలేదు. నేటికీ కుటుంబ వారసత్వానికి మించి చూడలేకపోతోంది. ఆనాడు మహాత్మా గాంధీజీ ఇదంతా ముందే ఊహించారు కనుకనే స్వాతంత్ర్యం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన సలహాను పెడచెవిన పెట్టి దేశ రాజకీయాలలోకి ప్రవేశించి, అధికారం చేపట్టి దేశాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించింది.
మహాత్మా గాంధీజీ కోరుకొన్నట్లు దేశంలో కాంగ్రెస్ లేకపోతే ఎన్నో అనర్ధాలు తప్పేవి. కాంగ్రెస్ లేకుంటే దేశంలో ఎమర్జన్సీ వచ్చేదే కాదు. కాంగ్రెస్ లేకపోతే ఢిల్లీలో సిక్కుల ఊచకోత జరిగేదే కాదు. కాంగ్రెస్ లేకుంటే కశ్మీరీ పండిట్ల సమస్య తలెత్తేదే కాదు. దేశంలో కులతత్వ రాజకీయాలు ప్రభలేవే కావు. దేశంలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలనలు వచ్చేవే కావు. దేశంలో బంధు ప్రీతి, అవినీతి వంటి జాడ్యాలు ప్రభలేవే కావు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నష్టపోయేవే కావు.
ఏది ఏమైనప్పటికీ దేశానికి పట్టిన కాంగ్రెస్ పీడ విరగడైంది. మరో 100 సంవత్సరాలైనా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. దేశానికి కాంగ్రెస్ పీడ వదిలించిన తరువాత మా ప్రభుత్వం చేపట్టిన అనేకానేక చర్యల వలన ఇప్పుడు దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోంది. కరోనా కష్ట కాలాన్ని ధైర్యంగా ఎదుర్కొని ప్రగతి పదంలో పయనిస్తూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది,” అని అన్నారు.