ప్రధాని నరేంద్రమోడీ కొద్దిసేపటి క్రితం శంషాబాద్ విమానాశ్రయం చేరుకోగా ఆయనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని నరేంద్రమోడీ హెలికాప్టర్‌లో పటాన్‌చెరు వద్ద గల ఇక్రిశాట్ సంస్థకు వెళ్ళిపోయారు.
అక్కడి కార్యక్రమాలు ముగించుకొన్న తరువాత అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌లోని సమాతా స్పూర్తి కేంద్రం చేరుకొంటారు. అక్కడ సుమారు రెండున్నర గంటలు పర్యటించి స్పూర్తి కేంద్రాన్ని చూస్తారు. శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహావిష్కరణ తరువాత తిరిగి హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని విమానంలో ఢిల్లీ తిరిగివెళ్ళిపోతారు.
ఆనవాయితీ ప్రకారం ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వాగతం చెప్పాలి కానీ సిఎం కేసీఆర్‌కు కొద్దిగా జ్వరం రావడంతో ఆయన ప్రధానికి స్వాగతం పలికేందుకు రాలేకపోయారని తాజా సమాచారం. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఆ బాధ్యత అప్పగించినట్లు నిన్ననే ఓ లేఖ బయటకు వచ్చింది. ప్రధానికి స్వాగతం చెప్పడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చారు కనుక ఆ లేఖ నిజమే అని భావించాల్సి ఉంటుంది.
ఇటీవల సిఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి ప్రధాని నరేంద్రమోడీ... ఆయన ప్రభుత్వం... బిజెపిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బహుశః ఆ కారణంగానే ఆయన ప్రధాని పర్యటనకు దూరంగా ఉండి ఉండవచ్చు. కానీ సిఎం కేసీఆర్‌కు కొద్దిగా జ్వరం వచ్చినందునే రాలేకపోయారని, జ్వరం తగ్గితే ముచ్చింతల్‌లో ప్రధాని నరేంద్రమోడీని కలుస్తారని వార్త వినిపిస్తోంది. దీనిపై బిజెపి నేతలు ఏవిదంగా స్పందిస్తారో తేలికగానే ఊహించుకోవచ్చు.