బిజెపి నేత, మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి

బిజెపి సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి (87) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 

జంగారెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరకాలలో 1935లో జన్మించారు. 1967 నుంచి 1972వరకు ఆయన పరకాల నియోజకవర్గానికి శాసనసభలో ప్రాతీధ్యం వహించారు. 1984లో ఆయన బిజెపి తరపున లోక్‌సభ ఎన్నికలలో హన్మకొండ నుంచి దివంగత ప్రధాని పీవీ నరసింహరావుపై పోటీచేసి భారీ మెజార్టీతో గెలిచారు. 

జంగారెడ్డి మృతిపట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర బిజెపి నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్ధివ దేహాన్ని హైదరాబాద్‌లో బిజెపి కార్యాలయంలో కొంతసేపు ఉంచి నివాళులు అర్పించిన తరువాత కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తారు.