
టిఆర్ఎస్‌లో చేరే ముందు కొంతకాలం బిజెపిలో ఉన్న దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు, ఇప్పుడు బిజెపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అసలు సిఎం కేసీఆర్ ఏమన్నారని రాష్ట్ర బిజెపి నేతలు చొక్కాలు చించుకొని రోడ్లెక్కి గోలగోల చేస్తున్నారు?సిఎం కేసీఆర్ రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీస్తే తప్పేముంది?సిఎం కేసీఆర్ జాతీయస్థాయి నేతగా ఎదుగుతుండటంతో బిజెపికి భయం పుట్టుకొంది. ఎలాగైనా తొక్కేయాలని చూస్తోంది.
దేశంలో సిఎం కేసీఆర్ ఒక్కరే దళితుల కోసం ఆలోచించి దళిత బంధు పధకం ప్రవేశపెట్టారు. బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తునారు. దేశంలో మరే రాష్ట్రమైనా... కేంద్రప్రభుత్వమైనా బడుగు బలహీన వర్గాల కోసం ఇన్ని చేయగలిగాయా? రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పధకానైనా బిజెపి పాలిత రాష్ట్రాలలో అమలుచేస్తున్నారా? చేయగలరా? కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు విభజన హామీలనే అమలుచేయలేదు. ఎప్పటికైనా చేస్తుందో లేదో కూడా తెలీదు. బడ్జెట్‌లో బిజెపి పాలిత రాష్ట్రాలకి లేదా ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తుంటుంది తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు. కేంద్రప్రభుత్వం తీరు చూస్తే అసలు అది ఉందా... లేదా?అనే అనుమానం కలుగుతోంది.
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొని, ప్రధాని నరేంద్రమోడీ రైతులకు క్షమాపణ చెప్పినప్పుడే ఆయన పరువు పోయింది. అప్పుడే ఆయన రాజీనామా చేసి ఉండాలి. సిఎం కేసీఆర్ గురించి బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు. కబడ్డార్ నోరు అదుపులో పెట్టుకో లేకుంటే తగిన విదంగా బుద్ధి చెప్పవలసి వస్తుంది,” అంటూ తీవ్రంగా హెచ్చరించారు.