ఓవైసీపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాన్వాయ్‌పై గురువారం యూపీలో మీరట్‌ వద్ద టోల్‌ప్లాజా వద్ద తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయిన ఇద్దరు వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఓవైసీ చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలతో తమకు ఆగ్రహం కలిగినందునే ఆయనపై దాడికి ప్రయత్నించామని వారు చెప్పారని హపూర్ పోలీస్ సూపరింటెండెంట్‌ దీపక్ భుకేర్ మీడియా ప్రతినిధులకు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని తెలిపారు. 

నిన్న జరిగిన ఈ ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, “లోక్‌సభ ఎంపీనైన నేను యూపీలో పర్యటిస్తున్నప్పుడు నా రక్షణ బాధ్యత పూర్తిగా యూపీ ప్రభుత్వానిదే. కానీ ఈవిషయంలో యూపీ ప్రభుత్వం అశ్రద్ద చూపినందునే ఈ ఘటన జరిగింది. దీనిపై నేను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేస్తాను,” అని అన్నారు. 

ఈ దాడిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం అసదుద్దీన్ ఓవైసీకి సీఆర్పీఎఫ్ దళాలతో జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని నిర్ణయించింది. 

ఈనెల 10 నుంచి మార్చి 7వ తేదీ వరకు ఏడు దశలలో యూపీలో 403 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో 80 స్థానాలకు మజ్లీస్ పోటీ చేస్తోంది. కనుక అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ఆయా నియోజకవర్గాలలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మార్చి 10వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.