శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకొంటారు. సాయంత్రం 5 గంటలకు పటాన్‌చెరులో ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవాలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఇక్రిశాట్ కొత్త లోగోను ఆవిష్కరిస్తారు. తరువాత ఇక్రిశాట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన వాతావరణ మార్పుల పరిశోధనా కేంద్రాన్ని, ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్‌మెంట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 

అనంతరం అక్కడి నుంచి ముచ్చింతల్‌లోని సమతా కేంద్రానికి చేరుకొని అక్కడ నెలకొల్పిన 216 అడుగుల ఎత్తున్న రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తరువాత సమతా కేంద్రంలో నిర్మించిన 108 దేవాలయాలను సందర్శిస్తారు. అనంతరం మళ్ళీ ఢిల్లీ తిరిగి వెళతారు. 

ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా పటాన్‌చెరు, ఇక్రిశాట్, ముచ్చింతల్ పరిసర ప్రాణాతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 

మోడీ ప్రభుత్వం, బిజెపిలపై సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తూ కత్తులు దూస్తున్న ఈ సమయంలో ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నందున, టిఆర్ఎస్‌-బిజెపిల మద్య మరో కొత్త యుద్ధం ప్రారంభం కావచ్చు.