
సిఎం కేసీఆర్ దంపతులు గురువారం సాయంత్రం శంషాబాద్, ముచ్చింతల్ వద్ద కొత్తగా నిర్మించిన సమతా స్పూర్తి కేంద్రాన్ని సందర్శించారు. కేసీఆర్ దంపతులకు శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావు తదితరులు ఆహ్వానం పలికారు. అక్కడ శ్రీరామనగరంలోని ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సిఎం కేసీఆర్ పరిశీలించారు. తరువాత భద్రవేదికపై నెలకొల్పిన శ్రీ రామానుజుల వారి విగ్రహాన్ని దర్శించుకొన్నారు.
రామానుజ సహస్ర సమారోత్సవాలలో భాగంగా జరుగబోయే హోమాలకు అగ్ని ప్రతిష్ట కార్యక్రమంలో సిఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. దానికి ప్రారంభ సూచికగా నాలుగున్నర అడుగుల ఎత్తు, 1,260 కేజీల బరువు గల భారీ గంటను సిఎం కేసీఆర్ మోగించారు. తరువాత సమతా కేంద్రంలో 120 కేజీల బంగారంతో నిర్మించిన శ్రీ రామానుజులవారి విగ్రహాన్ని ప్రతిష్టించబోయే ప్రదేశాన్ని దర్శించారు. సమాటా కేంద్రంలో నిర్మించిన 108 దివ్య దేశాలు (ఆలయాలు), రామానుజుల వారి జీవిత చరిత్రను తెలిపే పెయింటింగ్స్ సందర్శించారు. చిన జీయర్ స్వామి స్వయంగా సిఎం కేసీఆర్ దంపతుల వెంట తిరుగుతూ సమతా కేంద్రం విశేషాలు తెలియజేశారు. శ్రీ రామానుజులవారి దివ్యా సందేశాలను లోకానికి అందజేసేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకొన్నందుకు సిఎం కేసీఆర్ చిన జీయర్ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.